Telangana: వేర్వేరుగా బతకలేక.. కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట!

Lovers Suicide in vikarabad
  • వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఘటన
  • యువతికి ఇష్టం లేని పెళ్లి
  • ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్న వైనం
వేర్వేరుగా కలిసి బతకలేని ఓ ప్రేమ జంట కలసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నారెగూడ (పూలపల్లి)లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్ (21), అదే గ్రామానికి చెందిన మీన (21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన మీన తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి కుమార్తెకు వివాహం చేశారు. అయినప్పటికీ మీన, కార్తీక్ ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో కార్తీక్‌‌పై ప్రేమను చంపుకోలేకపోయిన మీన మంగళవారం గట్టుపల్లిలోని అత్తారింటి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసి కార్తీక్‌ను కలిసింది. అనంతరం ఇద్దరూ కలసి బైక్‌పై నారెగూడ చేరుకున్నారు. కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామ శివారులోని వేపచెట్టుకు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఉదయం గమనించిన గ్రామస్థులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మీన మెడలో పసుపుకొమ్ము దారంతో పుస్తె ఉండడంతో ఆత్మహత్యకు ముందు వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, కలిసి బతికే అవకాశం లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana
Vikarabad District
lovers
Suicide

More Telugu News