Mamata Banerjee: మారిన షెడ్యూల్... నేడు ఆరుగురు సీఎంలతో మాత్రమే మాట్లాడనున్న మోదీ!

  • కరోనా వచ్చిన తరువాత 7వ వీడియో కాన్ఫరెన్స్
  • తన పేరు లేకపోవడంతో మమతా బెనర్జీ ఆగ్రహం
  • ఇప్పటికే సమావేశానికి హాజరు కాలేనన్న వైఎస్ జగన్
Modi Video Conference Schedule Changed

నేడు 15 మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాల్సిన మోదీ, తన షెడ్యూల్ ను సవరించుకున్నారు. కేవలం ఆరుగురితో మాత్రమే మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. ఇక, నేడు మోదీ మాట్లాడాల్సిన ముఖ్యమంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కారాదని, రాష్ట్రం తరఫున ఓ ప్రతినిధిని కాన్ఫరెన్స్ లో కూర్చోబెట్టాలని ఆమె భావిస్తున్నారు.

చివరి నిమిషంలో షెడ్యూల్ ను మార్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మమత, కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. బెంగాల్ గొంతును నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. కాగా, మమత ఏం మాట్లాడతారోనన్న భయంతోనే ఆమె పేరును ప్రసంగీకుల జాబితా నుంచి తొలగించారని బరాసత్ ఎంపీ, తృణమూల్ నేత కకోలీ ఘోష్ మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బెంగాల్ ప్రజలెవరు మరచిపోరని, మరో ఎంపీ దినేశ్ త్రివేది వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత, నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ఏడవ వీడియో కాన్ఫరెన్స్ ఇది. మంగళవారం నాడు దాదాపు 20 రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో మోదీ మాట్లాడారు. అయితే, నేడు మోదీ మాట్లాడనున్న రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశానికి హాజరు కాలేనని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, పీఎంఓకు సమాచారాన్ని పంపిన సంగతి తెలిసిందే.

More Telugu News