Corona Virus: మహమ్మారిని తట్టుకుంటున్న భారతీయులు... మనకా సామర్థ్యం ఉందని తేల్చిన ఎయిమ్స్ అధ్యయనం!

  • జనసాంద్రత పరంగా చూస్తే కేసులు తక్కువే
  • ఇప్పటికే 42 శాతం వ్యాపించిన వైరస్
  • చాలా మందిలో లక్షణాలే కనిపించడం లేదు
  • వైరస్ ను శరీరం తిప్పికొడుతోందన్న పరిశోధకులు
AIIMS Study on Corona Virus

జనసాంద్రత పరంగా పోలిస్తే, ఈ పాటికే అమెరికాలో నమోదైన కరోనా కేసులను ఇండియా ఎప్పుడో దాటిపోవాలి. కానీ అలా జరగలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, జనాభా సంఖ్యతో పోలిస్తే, కరోనా రోగుల నిష్పత్తి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రయోగాలు చేసిన ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), ఈ వైరస్ ఎదుర్కొనే శక్తి భారతీయుల్లో ఉందని, వైరస్ సోకినప్పటికీ చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని తేల్చింది. వైరస్ జన్యు క్రమాన్ని, అది సోకినవారి శరీరం ఎదుర్కొంటున్న తీరును అధ్యయనం చేసిన ఎయిమ్స్ పరిశోధకులు, భారత్ లో 7 రకాల్లో ఉన్న వైరస్, ఇప్పటికే 42 శాతం వ్యాపించిందని తెలిపారు.

వీటిల్లో ఏ2ఏ రకానికి చెందిన వైరస్ పై పరిశోధించి, రోగ నిరోధక శక్తిపై దీని ప్రభావాన్ని అంచనా వేశారు. ఎన్డీబీఐ జీన్ బ్యాంకు నుంచి దీన్ని సేకరించామని, ఎయిమ్స్ లోని పీడియాట్రిక్స్, గైనకాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలు అధ్యయనంలో పాల్గొన్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డాక్టర్ రూబీ ధార్, డాక్టర్ అకౌరీ యాష్ సిన్హా నేతృత్వంలో వైరస్ పై పరిశోధనలు చేసి రిపోర్టును తయారు చేశామని అన్నారు.

కాగా, ఏ2ఏ రకం శరీరంలోకి ప్రవేశిస్తే, రెండు, మూడురోజుల్లోనే ప్రభావం చూపడాన్ని మొదలు పెడుతుందని, అయితే, ఈ వైరస్ సోకినా చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని, శరీరంలోని యాంటీ బాడీలు దీన్ని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఈ రకం కరోనాను శరీరం ఎదుర్కొంటూ రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తోందని తమ పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు.

ఇదిలావుండగా, సీసీఎంబీ చేసిన పరిశోధనల్లో మరో రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. 1/ఏ3ఐ అనే రకం ఇండియాలో 50 శాతానికి పైగా విస్తరించిందని, దీనిపైనా లోతైన పరిశోధనలు చేయాల్సి వుందని వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News