Corona Virus: 170 కోట్ల మందికి కరోనా ముప్పు... ప్రతి ఐదుగురిలో ఒకరికి సోకే అవకాశం!

  • లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యయనం
  • 34.9 కోట్ల మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి
  • అధ్యయనం వివరాలు లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మేగజైన్ లో
One in Every Five in World at covid Risk

ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఒకరిని కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టనుందని, సుమారు 170 కోట్ల మంది వైరస్ ముప్పులో ఉన్నారని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పేర్కొంది. పలువురు పరిశోధకులు కరోనాపై ఓ అధ్యయనాన్ని నిర్వహించగా, లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మేగజైన్, దీని వివరాలను ప్రచురించింది. భూ మండలంపై ఉన్న మొత్తం జనాభాలో 22 శాతం మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారని, వారికి వైరస్ సోకితే ప్రమాదకరమని పేర్కొంది.

ఇక, మొత్తం జనాభాలో నాలుగు శాతం... అంటే 34.9 కోట్ల మందికి కరోనా సోకితే హాస్పిటలైజేషన్ తప్పదని ఈ అధ్యయనం హెచ్చరించింది. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది 70 ఏళ్ల పైబడిన వారు కాగా, 5 శాతం మంది 20 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారని గుర్తు చేసిన పరిశోధకులు, పురుషుల్లో 6 శాతం మందికి, మహిళల్లో 3 శాతం మందికి వైరస్ ముప్పు అధికమని వెల్లడించారు.

ఐరోపా దేశాల్లో వృద్ధుల సంఖ్య అధికమని, అందువల్లే అక్కడ వైరస్ ప్రభావం అధికంగా ఉందని, మధుమేహం అధికంగా ఉన్న చిన్న దేశాల్లో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దేశాల్లోనూ మహమ్మారి విజృంభిస్తుందని పరిశోధకులు తెలిపారు. కాగా, మంగళవారం నాటికి అమెరికాలో కేసుల సంఖ్య 21.89 లక్షలు దాటగా, 1.18 లక్షలకు పైగా మరణించారు. ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ 8.91 లక్షలకు పైగా కేసులతో, రష్యా 5.45 లక్షలకు పైగా కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News