విలన్ పాత్రకు మహేశ్ సూచించిన నటుడు!

16-06-2020 Tue 13:20
  • 'సర్కారు వారి పాట'లో పవర్ ఫుల్ విలన్  
  • 'ఈగ' సుదీప్ అంటూ మొదట్లో ప్రచారం
  • మహేశ్ సూచన మేర ఉపేంద్ర కోసం ప్రయత్నాలు  
Mahesh Babu suggested Upendra for villain role

మన సినిమాలకి హీరో ఎంతో విలన్ కూడా అంతే! హీరో ఇమేజ్ కి తగ్గా సమ ఉజ్జీ వుండాలి. హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో, విలన్ కూడా అంత పవర్ ఫుల్ గానూ వుండాలి. లేకపోతే తేలిపోతారు. అందుకే, మన స్టార్ హీరోల సినిమాలకు విలన్ పాత్రధారిని ఎంపిక చేయడం కూడా కష్టమైన పనే. ఇప్పుడు మహేశ్ బాబు నటించే సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది.

పరశురాం దర్శకత్వంలో మహేశ్ తాజాగా 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర అయిన విలన్ రోల్ కోసం మొదట్లో కన్నడ స్టార్ 'ఈగ' ఫేం సుదీప్ ను ఎంపిక చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా ఈ పాత్ర కోసం మరో కన్నడ స్టార్ ఉపేంద్ర పేరు వినిపిస్తోంది. గతంలో తెలుగులో హీరోగా, విలన్ గా పలు చిత్రాలలో నటించిన ఉపేంద్ర అయితే ఈ పాత్రకు బాగుంటుందని మహేశ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఆయన కోసం యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.