Business Man: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం సొంత హత్యకు సుపారీ... పని పూర్తిచేసిన హంతకులు!

  • ఆర్థిక సమస్యల్లో కూరగాయల వ్యాపారి
  • తాను చనిపోతే కుటుంబానికి బీమా సొమ్ము వస్తుందని ఆలోచన
  • చంపి చెట్టుకు వేలాడదీసిన హంతకులు
Delhi man got himself murdered for insurance money

ఢిల్లీలో ఓ వ్యాపారి తన కుటుంబానికి ఇన్సూరెన్స్ సొమ్ము లభిస్తుందన్న కారణంతో తన సొంత హత్యకు సుపారీ ఇవ్వగా, హంతకులు చెప్పిన పని పూర్తి చేశారు. గౌరవ్ బన్సాల్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేసేవాడు. ఫిబ్రవరిలో రూ.6 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుని డిప్రెషన్ కు చికిత్స కోసం వినియోగించాడు. క్రెడిట్ కార్డు మోసాల్లో రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓ దశలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కుటుంబం అయినా హాయిగా బతుకుతుందని భావించాడు.

అనుకున్నదే తడవుగా ఓ మైనర్ బాలుడ్ని ఫోన్ ద్వారా సంప్రందించి తన హత్యకు తానే సుపారీ మాట్లాడుకున్నాడు. అంతేకాదు, తన ఫొటోను కూడా ఆ మైనర్ కు పంపించాడు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఫలానా ప్రదేశానికి వస్తాడని చెప్పి, అక్కడికి తానే వెళ్లాడు. ఆ కుర్రాడు మరో ముగ్గురి సాయంతో గౌరవ్ బన్సాల్ ను చంపి చెట్టుకు వేలాడదీశాడు. అయితే, తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య షాను బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని మీద బయటికెళ్లి తిరిగిరాలేదని తెలిపింది.

దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌరవ్ ఫోన్ డేటాపై దృష్టి సారించారు. ఓ మైనర్ కుర్రాడితో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో సొంత హత్యకు సుపారీ వ్యవహారం వెల్లడైంది. ఈ ఘటనలో మైనర్ బాలుడితో సహా మనోజ్ కుమార్ యాదవ్, సూరజ్, సుమిత్ కుమార్ లను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లారు.

More Telugu News