Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు సారీ చెపుతూ.. ఘాటు లేఖ రాసిన మీరా చోప్రా

Nobody shared their love to Sushant Singh Rajput says Meera Chopra
  • సుశాంత్ ను బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు
  • ఇక్కడ జాలి, దయ ఉండవు
  • చనిపోయిన తర్వాత మాత్రం సుదీర్ఘమైన సందేశాలు ఇస్తారు
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై విమర్శలు గుప్పిస్తూ నటి మీరా చోప్రా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ పై మండిపడింది. సుశాంత్ బాధల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ లో ఎవరూ అతన్ని పట్టించుకోలేదని విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఘాటు లేఖను పోస్ట్ చేసింది.

ఒకే పరిశ్రమలో పని చేస్తున్న వారు ఒకరికొకరు అండగా లేకపోవడం దారుణమని మీరా చోప్రా వ్యాఖ్యానించింది. గత కొంత కాలంగా సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతుంటే... అతని కోసం మనం ఏం చేశామని ప్రశ్నించింది. అతని కోసం ముందుకొచ్చి ఎవరూ ప్రేమను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే... ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరని విమర్శించింది.

బాలీవుడ్ అనేది ఒక చిన్న కుటుంబమని... అయినా, ఇక్కడ జాలి, దయ అనేది ఉండదని మీరా చోప్రా మండిపడింది. ఈ కుటుంబం కోసం సుశాంత్ ఎంతో బాధను అనుభవించాడని చెప్పింది. మనిషి బతికున్నప్పుడు ఇక్కడ ఎవరూ పలకరించరని... చనిపోయిన తర్వాత మాత్రం సుదీర్ఘమైన సందేశాలను ఇస్తుంటారని దుయ్యబట్టింది. ఇలాంటి వాటివల్ల ప్రయోజనం లేదని చెప్పింది.

'సుశాంత్ నీ విషయంలో అందరం ఫెయిల్ అయ్యాం. అందుకే ఇండస్ట్రీ తరపున నీకు సారీ చెపుతున్నా. నీ మృతితో నా సొంత వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతోంది' అంటూ మీరా ఆవేదన వ్యక్తం చేసింది.
Sushant Singh Rajput
Meera Chopra
Bollywood

More Telugu News