New Delhi: ఢిల్లీలో కరోనా చికిత్సకు హోటళ్లు, బాంకెట్ హాల్స్!

  • దేశ రాజధానిలో పెరిగిపోతున్న కేసులు
  • వారంలో 20 వేల కొత్త బెడ్స్ ఏర్పాటు
  • హోటళ్లను సంప్రదించిన ప్రభుత్వం
  • వెల్లడించిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా
Hotels and Banquet Halls for Corona Treatment in Delhi

రోజురోజుకూ కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్న వేళ, నగరంలోని హోటళ్లను, బాంకెట్ హాల్స్ ను ఆసుపత్రులుగా వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. వచ్చే వారం రోజుల వ్యవధిలో పలు హోటల్స్, వాటిల్లోని బాంకెట్ హాల్స్ లో 20 వేల బెడ్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేసింది.

ప్రస్తుతం ఢిల్లీలో 38 వేలకు పైగా కేసులుండగా, ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపవుతున్న సమయాన్ని బట్టి, జూలై నెలాఖరు నాటికి మొత్తం 5.5 లక్షల కేసులు ఢిల్లీలో ఉంటాయని అంచనా వేసిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు.

పెరుగుతున్న కేసుల సంఖ్యను అనుసరించి, వైద్య సదుపాయాల కల్పనకు, కేసుల అణచివేతకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదివారం నాడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, వైద్య మంత్రి హర్ష వర్ధన్ లతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రం, మొత్తం కేసుల విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత మూడో స్థానంలో ఉంది. 

కాగా, ఇప్పటికే 80 బాంకెట్ హాల్స్ ను గుర్తించిన ఢిల్లీ సర్కారు, వాటిల్లో 11 వేల బెడ్లను ఏర్పాటు చేసి, వాటిని నర్సింగ్ హోమ్స్ కు అటాచ్ చేయాలని నిర్ణయించింది. దీనికి అదనంగా 40 ప్రైవేటు హోటళ్లలో 4 వేల పడకలను సిద్ధంగా ఉంచి, వాటిని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానం చేయాలని కూడా భావిస్తోంది. ప్రతి నర్సింగ్ హోమ్ లో 10 నుంచి 49 బెడ్లను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించి వుంచాలని ఆదేశించింది.

More Telugu News