Minnesota: చేయని తప్పుకు జైలుశిక్ష... వందేళ్ల తరువాత నల్లజాతి వ్యక్తికి అమెరికా కోర్టు క్షమాపణలు!

  • 1920లో హత్యాచార ఆరోపణలతో జైలుకు మ్యాక్స్ మాసన్
  • తాను నిరపరాధినని పదేపదే మొరపెట్టుకున్నా వినని కోర్టు
  • 1942లో జైలులోనే మరణించిన మాసన్
  • ఇన్నేళ్ల తరువాత క్షమాపణలు చెప్పిన మిన్నెసోటా
Minnesota Court Pardons Black Man Accused Of Rape after 100 Years

అమెరికా చట్టాల్లో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఏ విధమైన మార్పును తెస్తున్నదనడానికి ఇది తాజా ఉదాహరణ. 1920, జూన్ 15న మిన్నెసోటా నగర పరిధిలో ఓ తెల్లజాతి యువతిని రేప్ చేశారన్న ఆరోపణలతో ప్రజలు, ముగ్గురు నల్లజాతి యువకులను మూకదాడిలో హతామార్చగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 1942లో మరణించిన వ్యక్తి, ఈ కేసులో నిర్దోషని కోర్టు తాజాగా తీర్పిచ్చింది. ఈ కేసులో తాను నిరపరాధినని పదేపదే మాక్స్ మాసన్ అనే యువకుడు కోర్టును కోరినా పట్టించుకోని న్యాయాధికారులు, అతను మరణించిన తరువాత, తాజాగా, ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.

మిన్నెసోటాలో మరణించిన తరువాత నిర్దోషిగా నిరూపించబడిన తొలి వ్యక్తి మ్యాక్స్ మాసన్ కావడం గమనార్హం. మాసన్ ఈ కేసుతో ఎటువంటి సంబంధమూ లేని వ్యక్తని జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కొన్ని రోజుల ముందు కూడా పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం, తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పుపై స్పందించిన మిన్నెసోటా అటార్నీ జనరల్ కీత్ వెల్లీసన్, "100 సంవత్సరాల తరువాతైనా న్యాయం జరిగింది" అని వ్యాఖ్యానించారు. గత కొన్ని వారాలుగా మెరుగైన న్యాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ సమయం వచ్చిందని, మాక్స్ మాసన్ విషయంలో న్యాయం ఆలస్యమైనా, ఇప్పుడు పడ్డ అడుగు అత్యంత కీలకమని అన్నారు.

కాగా, 1920, జూన్ 14న తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇర్నే టుస్కెన్ అనే తెల్ల జాతి యువతి సర్కస్ చూసేందుకు వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న కొందరు నల్లజాతి యువకులు అత్యాచారం చేశారన్నది ఆరోపణ. తదుపరి రోజు యువతి బాయ్ ఫ్రెండ్ ఫిర్యాదుతో అక్కడికి వెళ్లిన పోలీసులు, జాసన్ సహా ఎంతో మంది నల్లజాతి వర్కర్లను ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేకపోయినా కేసును ఫైల్ చేశారు.

కోర్టులో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం, సదరు యువతిపై దాడి జరిగినట్టు ఏ విధమైన ఆధారాలూ లభించలేదు. అప్పట్లో కేసును క్లోజ్ చేసిన తరువాత, జైలు నుంచి విడుదలైన మాసన్, తన సర్కస్ టీమ్ తో డులుత్ నగరాన్ని వదిలి వెళ్లగా, పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి, అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న నగర ప్రజలు, పోలీసు స్టేషన్ పై దాడి చేసి, జాసన్ సహా, మిగతా నిందితులను దారుణంగా కొడుతూ, వీధుల్లో ఊరేగించారు. ఆపై నిందితులను పోలీసులు రక్షించి జైలుకు తరలించారు.

ఈ ఘటనలో మూకదాడి నుంచి తప్పించుకున్న మాసన్ కు 30 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిన మాసన్, ఓ ప్రాణాంతక వైరస్ సోకి మరణించాడు. ఇదే ఘటనపై ప్రముఖ అమెరికన్ సింగర్ బాబ్ డైలన్ 1965లో రాసిన 'డిసోలేషన్ రో...' ఎంతో హిట్ అయింది. ఈ కేసులో అమాయకులు శిక్షను అనుభవించారని భావించిన మిన్నెసోటా రాష్ట్ర ప్రజలు, 2003లో మరణించిన ముగ్గురి స్మారకార్థం, ఓ స్థూపాన్ని కూడా నిర్మించారు. ఇంతకాలానికి, మాసన్ ను నిర్దోషిగా ప్రకటించడం మారుతున్న పరిస్థితికి నిదర్శనం.

  • Loading...

More Telugu News