Sunil Gavaskar: ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన తర్వాత ఐపీఎల్ పై ఆశలు కలగడంలేదు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar analyzes IPL chances in present scenario
  • అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • 25 శాతం ప్రేక్షకులతో క్రీడాపోటీలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం
  • వరల్డ్ కప్ వాయిదా పడితే ఐపీఎల్ జరిపేందుకు బీసీసీఐ ఆరాటం
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కరోనా ప్రభావం అంతాఇంతా కాదు. లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈ టోర్నీని ఎలాగైనా జరపాలని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పట్టుదలగా ఉన్నాడు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ జరపాలని, భారత్ లో వీలుకాకుంటే శ్రీలంక సహా మరే విదేశీ గడ్డపై అయినా నిర్వహించాలని భావిస్తున్నాడు.

అయితే, అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ వాయిదా పడితేనే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అలాంటి నిర్ణయాన్ని ఆస్ట్రేలియా సర్కారు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.

ఈ ఏడాది సెప్టెంబరులో ఐపీఎల్ నిర్వహించడం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, ఆస్ట్రేలియాలోని స్టేడియాల్లో 25 శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ప్రకటన ద్వారా భవిష్యత్తులో క్రీడాపోటీలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చినట్టయిందని గవాస్కర్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన వింటుంటే టీ20 వరల్డ్ కప్ జరుగుతుందన్న నమ్మకం కలుగుతోందని, ఇదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని తెలిపారు.

ఆస్ట్రేలియాలో అక్టోబరు నుంచి టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఒకవేళ సెప్టెంబరులో ఐపీఎల్ జరపాలన్నా వీలు కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. అక్టోబరులో ఆసీస్ గడ్డపై జరిగే టోర్నీ కోసం ఆయా జట్లన్నీ ఎంతో ముందుగా అక్కడికి వెళ్లి 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని, పైగా ప్రాక్టీసు మ్యాచ్ లు, శిక్షణ శిబిరాలు తప్పవని వివరించారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబరు నుంచే మొదలైతేనే అక్టోబరులో ప్రపంచకప్ జరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ కు చోటెక్కడని ప్రశ్నించారు.
Sunil Gavaskar
IPL
T20 World Cup
Australia
Lockdown
Corona Virus

More Telugu News