Perni Nani: కక్కుర్తి సొమ్ము కోసం ఎంత నీచానికైనా దిగజారే మాజీ శాసనసభ్యుడు, ఆయన కుటుంబం అక్రమాలు ఇవే: పేర్ని నాని

  • జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • హైదరాబాద్ నుంచి అనంతపురం తరలింపు
  • జేసీ అక్రమాలు ఇవేనంటూ మీడియాకు తెలిపిన మంత్రి పేర్ని నాని
Perni Nani tells about JC Prabhakar Reddy and co

జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి అనంతపురం తరలించడం తెలిసిందే. దీనిపై మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అరెస్టుల పేరుతో టీడీపీ నేతలను భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, ఆయన సంపాదించిన 40 ఏళ్ల అనుభవం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వచ్చినా, లోకేశ్ వచ్చినా, ఇతర టీడీపీ సీనియర్లు వచ్చినా జగన్ ప్రభుత్వం మీడియా సమక్షంలో అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కక్కుర్తి సొమ్ము కోసం ఎంత నీచానికైనా దిగజారే మాజీ శాసనసభ్యుడు, అతని కుటుంబ సభ్యుల అక్రమాల గురించి జగన్ సర్కారు ఆధారాలతో సహా వివరించాలని నిర్ణయించుకుందని తెలిపారు.

"బీఎస్3 ప్రమాణాలతో వాహనాలను 2017 మార్చి 31 తర్వాత ఏ కంపెనీ తయారు చేయకూడదు, షోరూంలలో అమ్మకూడదు, ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, అశోక్ లేలాండ్ కంపెనీ వద్ద ఇలా మిగిలిపోయిన 154 బీఎస్3 లారీ చాసిస్ లను జేసీ కుటుంబసభ్యులు జటాధరా ఇండస్ట్రీస్, మెస్సర్స్ సి.గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట కొనుగోలు చేశారు. జటాధరా ఇండస్ట్రీస్ కంపెనీలో జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు.

ఈ రెండు కంపెనీల ద్వారా 66 బీఎస్3 లారీ చాసిస్ లు 2018లో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అయినట్టు మాకు సమాచారం అందింది. ఈ చాసిస్ నెంబర్లు అశోక్ లేలాండ్ కంపెనీకి పంపిస్తే.... ఆ 66 చాసిస్ లలో 40 చాసిస్ లను గోపాల్ రెడ్డి కంపెనీకి, 26 చాసిస్ లను జటాధరా ఇండస్ట్రీస్ కు తుక్కు ఇనుము కింద అమ్మినట్టు రిప్లయ్ ఇచ్చారు. ఈ వాహనాలన్నీ నాగాలాండ్ లోని కోహిమాలో రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది. దాంతో మేం అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం.

ఈ నేపథ్యంలో అనంతపురం పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు నాగాలాండ్ లోని కోహిమా వెళ్లారు. అక్కడకి వెళితే 66 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు, ఎన్వోసీలతో సహా ఏపీ వచ్చాయని వెల్లడైంది. ఈ దశలో అనంతపురం పోలీసులు అశోక్ లేలాండ్ కంపెనీకి వెళితే... తాము విక్రయించింది 66 చాసిస్ లు కాదని, 154 చాసిస్ లు అని అసలు విషయం చెప్పారు.

దాంతో మేం లోతైన విచారణ చేస్తే ఇవన్నీ దశలవారీగా చేతులు మారుతూ వెళ్లాయి. చేతులు మారే దశలో  డాక్యుమెంట్లు వస్తాయి కాబట్టి ఇబ్బందులు ఉండవన్న పన్నాగం ఇది. వీటిలోనే కొన్ని చాసిస్ లను బస్సులుగా మార్చి దివాకర్ ట్రావెల్స్ కింద తిప్పుతున్నారు. రూపాయి కక్కుర్తి తప్పితే ప్రజల ప్రాణాలకు వీరిచ్చే విలువ ఏమీలేదు. వీళ్లు అప్పుడు ప్రజాప్రతినిధులు" అంటూ విమర్శలు గుప్పించారు.

More Telugu News