మరో సినిమాకు ఓకే చెప్పిన అనుష్క!

13-06-2020 Sat 09:07
  • పదిహేనేళ్ల నుంచీ కొనసాగుతున్న అనుష్క 
  • విడుదలకు సిద్ధంగా 'నిశ్శబ్దం'
  • తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా  
Anushka gives nod for one more heroine oriented film

తెలుగు సినిమా రంగంలో అనుష్క ప్రస్థానం ప్రత్యేకం. మొదటి నుంచీ ఓపక్క అటు గ్లామర్ పాత్రలను చేస్తూనే.. మరోపక్క కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలు కూడా చేస్తూ పేరుతెచ్చుకుంది. అందుకే తను వచ్చి పదిహేనేళ్లు అయినప్పటికీ, ఇంకా కొనసాగుతూనే వుంది.

అయితే, గత కొంతకాలంగా స్టార్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. కొత్త అమ్మాయిలు దూసుకురావడంతో అనుష్కకు అవకాశాలు తగ్గాయి. దీంతో తాను రూటు మార్చి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఆమె 'నిశ్శబ్దం' చిత్రంలో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.

ఇదిలావుంచితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో చిత్రాన్ని ఒప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమే కావడం గమనార్హం. గతంలో అనుష్కతో 'భాగమతి' చిత్రాన్ని తీసిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దీనిని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. 'రారా కృష్ణయ్య' ఫేం పి.మహేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.