Atchannaidu: అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు

  • ఈ ఉదయం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నపై ఆరోపణలు
  • నిమ్మాడ నుంచి అచ్చెన్న విజయవాడకు తరలింపు
ACB officials has taken Atchennaidu to ACB court

ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టీడీపీ ముఖ్యనేత కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. ఏసీబీ న్యాయమూర్తి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నారు.

ఈ ఉదయం నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ తరలించి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు పూర్తయిన పిమ్మట ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. కాగా, తమ టీడీపీ సహచరుడ్ని పరామర్శించేందుకు పార్టీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు తదితరులు ఏసీబీ న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు.

అటు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించే క్రమంలో ఆయనకు రక్తస్రావం జరిగిందని, రెండ్రోజుల క్రితమే ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను అరెస్ట్ చేయడం, తరలించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. విశ్రాంతిలో ఉన్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తరలించారని ఆరోపించారు.

కాగా, అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు ఏసీబీ కోర్టు వద్దకు నారా లోకేశ్ వచ్చారు. లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పరామర్శించడానికి కూడా ఒప్పుకోరా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు.

More Telugu News