Shankara Narayana: అచ్చెన్నాయుడు ఏమైనా గాంధీనా? లేక పూలేనా?: మంత్రి శంకరనారాయణ

  • అవినీతి ఆరోపణలతో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే కులం కార్డు అంటగడతారా అంటూ మంత్రి ఆగ్రహం
  • చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడి
AP Minister Shankara Narayana comments on Atchannaidu

ఉత్తరాంధ్ర టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడంపై వైసీపీ సర్కారు స్పందించింది. మంత్రి శంకరనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడని, ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు అని అన్నారు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మా గాంధీనా, లేక పూలేనా అంటూ ఘాటుగా స్పందించారు. ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? అంటూ ప్రశ్నించారు.

ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములేనని, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంత, లోకేశ్ పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉందని అన్నారు.

 అవినీతికి పాల్పడిన వాళ్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు గత ఐదేళ్లలో మంత్రిగా ఉంటూ బీసీలకు చేసిందేమిటి? అచ్చెన్నాయుడి దోపిడీ కారణంగా నష్టపోయింది బీసీలు కాదా? అంటూ నిలదీశారు. కానీ, సీఎం జగన్ ఇవాళ తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు ఓ అంబేడ్కర్ లా, ఓ పూలేలా అవతరించారని మంత్రి శంకరనారాయణ కొనియాడారు.

More Telugu News