USA: హెచ్-1బీ వీసాలను రద్దు చేసే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్!

  • అమెరికాలో పెరిగిపోయిన నిరుద్యోగం
  • అన్ని రకాల వీసాల సస్పెన్షన్ యోచన
  • 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనం
Trump Administration Thinks to Cancel H1B Visas

అమెరికాలో నిరుద్యోగ స్థాయి భారీగా పెరిగిపోయిన వేళ, అత్యంత కీలకమైన హెచ్-1బీ సహా, అమెరికాలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోగా, ఈ దశలో విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతిస్తే, వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.

వీసాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం కాగా, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబర్ 1 లోగా తుది నిర్ణయం వెలువడుతుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. "సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే వీసాలను పొంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు" అని ఆ అధికారి పేర్కొన్నారని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.

కాగా, ఈ నిర్ణయం అత్యధికంగా భారత సాఫ్ట్ వేర్ నిపుణులపైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తే, అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను వదిలేసి స్వదేశానికి రావాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో వైట్ హౌస్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేందుకు కట్టుబడివున్నామని, అందుకోసం చాలా మార్గాలను అన్వేషిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి హోగన్ గిడెలీ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News