Chennai: నవ వధువును చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త... తొలిరాత్రే ఇద్దరికీ ఆఖరి రాత్రి!

Man murders wife and commits suicide in Chennai
  • చెన్నైలో దారుణ ఘటన
  • అర్థరాత్రి వేళ రక్తపుమడుగులోభార్య
  • పారిపోయి చెట్టుకు ఉరేసుకున్న భర్త
తమిళనాడులో దారుణమైన సంఘటన జరిగింది. చెన్నైలో ఓ యువకుడు పెళ్లయిన రాత్రే భార్యను చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కత్తూర్ ఏరియాలో 24 ఏళ్ల నీతి వాసన్ కు, 20 ఏళ్ల సంధ్యతో బుధవారం పెళ్లి జరిగింది. అయితే ఆ తొలిరాత్రే వారిద్దరికీ ఆఖరి రాత్రి అవుతుందని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరూ ఊహించలేకపోయారు. అర్ధరాత్రి వేళ నవదంపతుల గదిలోంచి కేకలు వినిపించడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా, సంధ్య రక్తపుమడుగులో ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. పక్కనే ఓ ఇనుపరాడ్డు కనిపించడం, అక్కడే ఉండాల్సిన భర్త నీతివాసన్ లేకపోవడంతో అందరి అనుమానం అతడిపైకే మళ్లింది.

అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నీతివాసన్ కోసం గాలిస్తుండగా, అక్కడికి దగ్గర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. కొత్త ఆశలతో శోభనం గదిలోకి వెళ్లిన భార్యభర్తల మధ్య అసలేం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Chennai
Bride
Groom
Murder
Suicide

More Telugu News