Kinjarapu Ram Mohan Naidu: ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మానేసి...: విజయసాయిరెడ్డికి రామ్మోహన్ నాయుడు ఘాటు కౌంటర్

Ram Mohan Naidu gives strong counter to Vijayasai Reddy
  • అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు
  • చేతకానోడి పాలన చూసి సీనియర్లు 'ఛీ' కొడుతున్నారు
  • అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని మామ కుట్ర మొదలెట్టాడు
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న విమర్శలు గుప్పిస్తూ... మధ్యలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడును లాగిన సంగతి తెలిసిందే. 'కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబుగారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు' అని విజయసాయి ట్వీట్ చేశారు. విజయసాయి వ్యాఖ్యలకు రామ్మోహన్ నాయుడు కూడా అదే స్థాయిలో ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.

'అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.

మూడుముక్కలాట మొదలెట్టి మూతిముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ,అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు' అని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News