Upasana: చెంచుల ఆహారపు అలవాట్లపై ఉపాసన వ్యాఖ్యలు

  • శ్రీశైలంలో పర్యటించిన ఉపాసన
  • గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ
  • చెంచుల జీవనశైలికి ముగ్ధురాలైన మెగాకోడలు
Upasana responds on Chenchu people life style

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొన్నిరోజుల కిందట శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన బృందంతో నల్లమల అటవీప్రాంతాల్లోని చెంచు గూడేలను సందర్శించారు. అక్కడి ప్రజల సంస్కృతి, వారి జీవన విధానాన్ని ఆమె ఎంతో ఆసక్తికగా పరిశీలించారు. తాజాగా ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిలో రెండు మేక పిల్లలను ఎత్తుకుని ఉన్న ఫొటోలు ఉన్నాయి.

ఈ పోస్టులో ఆమె వ్యాఖ్యానిస్తూ... ఈ బుజ్జి మేకలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా  మారిపోతాయేమో అంటూ స్పందించారు. "ప్రజల ఆహారపు అలవాట్లను, వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం, గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం.

అయితే, మన నమ్మకాలు, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి.. కానీ మితంగా! మనకు ఈ వనరులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలుసుకుని మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం... మన భూమండలానికి, మనకు అవసరమైనంత మేర, నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం" అంటూ ఉపాసన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

More Telugu News