Telangana: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే విధానమిది!

  • ఇంటర్నల్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్
  • 5 రెట్లు పెంచి గ్రేడ్లు ప్రకటించనున్న విద్యా శాఖ
  • ప్రైవేటు విద్యార్థుల విషయంలో త్వరలోనే నిర్ణయం
  • వెల్లడించిన విద్యా శాఖ ఉన్నతాధికారి
Internal Marks Based Grading for 10th Students in Telangana

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించినట్టేనని, కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశామని కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, విద్యార్థులకు ర్యాంకులను ఎలా ఇస్తారు? జీపీఏ గ్రేడింగ్ ఎలా ఉంటుందన్న విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించగా, ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇప్పటి వరకూ విద్యాశాఖ నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించింది. వీటిని ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు ఇంటర్నల్‌ మార్కులను విద్యా శాఖ వెబ్ ‌సైట్ ‌లో పాఠశాలలు అప్ లోడ్ చేశాయి కూడా. ఆ మార్కులన్నీ ఇప్పుడు విద్యా శాఖ దగ్గరే ఉన్నాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్ లను నిర్ణయించి, మొత్తంగా జీపీఏ ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు.

విద్యాశాఖ వద్ద ఉన్న 20 శాతం ఇంటర్నల్‌ మార్కులనే వంద శాతానికి లెక్కిస్తూ, మార్కులను నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు. వన్‌ టైమ్‌ మెజర్‌ కింద ఈ చర్యలు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు. అంటే, ఇంటర్నల్ లో ఉన్న 20 శాతం మార్కులను ఐదు రెట్లు పెంచుతారు. అంటే, పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పాసైనట్టేనని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 5,34,903 మందిలో 25 వేల మందికి పైగా ప్రైవేటు విద్యార్థులుండగా, వారికి గ్రేడింగ్‌ విషయంలో అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించినందున వారికీ గ్రేడింగ్‌ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొనివుందని, వారికి జీపీఏ ఇచ్చే విధానం గురించి సమాలోచనలు సాగుతున్నాయని అన్నారు. వారు గతంలో పాసైన సబ్జెక్టును వదిలేసి, ఫెయిలైన సబ్జెక్టుల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్‌ను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.

More Telugu News