Tirumala: శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు... కనిపించని భౌతిక దూరం... తలపట్టుకుంటున్న అధికారులు!

  • నిన్నటి నుంచి భక్తులకు వెంకన్న దర్శనం
  • పలు ప్రాంతాల్లో టోకెన్ల జారీని ప్రారంభించిన అధికారులు
  • టోకెన్ల కోసం కిలోమీటర్ల మేరకు బారులు తీరిన భక్తులు
Piligrims Heavy Queue for Balaji Darshan

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలు తిరిగి ప్రారంభమై, తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేయడం మొదలైన తరువాత, వేల మంది పోటెత్తారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరూ భౌతిక దూరం పాటించక పోవడంతో అధికారులు తలపట్టుకున్నారు.

అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది. నిన్న సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు.

కాగా, అలిపిరి వద్దకు వచ్చే భక్తుల వద్ద ఉన్న దర్శన సమయం టోకెన్ పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. తొలి రోజున శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. టికెట్ తో పాటే తిరుమలలో గదిని కూడా కేటాయించే సదుపాయాన్ని కల్పించామని అధికారులు తెలిపారు.

More Telugu News