Nirav Modi: హాంకాంగ్ నుంచి 108 సంచుల నిండా వజ్రాలు, ముత్యాలు తెచ్చిన ఈడీ... నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీలవే!

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రుణాలు
  • తిరిగి చెల్లించడంలో విఫలమై విదేశాలకు పరార్
  • రూ. 1,350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు ఇండియాకు
  • వీటి బరువు 2,340 కిలోలు
108 Bags of Diamonds of Mehul and Niravs deoprted to India

ఇండియాలో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలకు చెందిన వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇండియాకు తీసుకుని వచ్చారు. హాంకాంగ్ లోని వారి సంస్థల నుంచి వీటిని 108 లగేజీ బ్యాగుల్లో ఇండియాకు చేర్చారు. వీటి విలువ దాదాపు రూ. 1,350 కోట్లని, నీరవ్ కు చెందిన బ్యాగ్ లు 32 ఉండగా, మిగతావి చోక్సీవని ఈడీ అధికారులు వెల్లడించారు.

వీటిని 2018లో హాంకాంగ్ నుంచి దుబాయ్ కి తరలించాలని ఇద్దరూ ప్రయత్నించగా, అప్పటికే అప్రమత్తమైన అధికారులు నిలువరించారు. ఆపై దౌత్య పరమైన చర్చలు ప్రారంభించి, వీరిద్దరి రుణాల ఎగవేతకు సంబంధించిన ఆధారాలను హాంకాంగ్ కు సమర్పించి, వీటిని ఇండియాకు చేర్చేందుకు ఎంతో శ్రమించారు. ఇక ఈ బ్యాగుల్లో 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాగా, వీరిద్దరూ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తప్పుడు గ్యారంటీలను చూపించి, 2 బిలియన్ డాలర్ల వరకూ రుణాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై రుణాన్ని తిరిగి చెల్లించడంలో వీరు విఫలం అయ్యారు. ఆపై ఇద్దరూ విదేశాలకు పారిపోయారు. నీరవ్ మోదీ లండన్ కు వెళ్లగా, అక్కడి అధికారులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే కాలం గడుపుతున్నాడు.

More Telugu News