ఇవాళ నువ్వూ, నీ కొడుకు పత్తిత్లుల్లాగ మాట్లాడతారా?: కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి ఫైర్

08-06-2020 Mon 14:25
  • కేటీఆర్ పై కొంతకాలంగా పోరాటం చేస్తున్న రేవంత్
  • ఇద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదామని సవాల్
  • కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యలు
 Reavanth Reddy challenges CM KCR and KTR
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జన్ వాడలో కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ కడుతున్న మాట వాస్తవమేనని రేవంత్ పునరుద్ఘాటించారు. అలాగే, తాను, తన బావమరిది వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ భూముల్లో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపడుతున్నా గడ్డపారతో కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పైనా మండిపడ్డారు. 'నీ ఉద్యమస్ఫూర్తిని, నీ త్యాగనిరతిని, నీ పౌరుషాన్ని ఇప్పుడు చూపించు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి' అంటూ నిలదీశారు. 'నువ్వూ, నీ కొడుకు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకుని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు' అంటూ మండిపడ్డారు.

"ముందు నా భూమి ఉన్న వట్టినాగులపల్లి వెళదాం. మీరు చెబుతున్న భవనమో, భవంతో ఉందన్నారు కదా. జేసీబీ నేనే నడుపుతా. అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే కూలగొడతా. ఆ తర్వాత నీ భూమి ఉన్న జన్ వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం" అంటూ సవాల్ విసిరారు.