Corona Virus: సగానికి పైగా తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు!

  • లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం
  • ఆటస్థలాలు, పార్కుల మూసివేతతో తగ్గిన దోమల దాడి
  • 54 శాతం తగ్గిన సీజనల్ వ్యాధిగ్రస్థులు
Seasonal Deaseases down

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో, ఈ వేసవిలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, కుష్టు తదితర వ్యాధులు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయాయి. ముంబయి మహా నగరంలో ఈ సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య 54 శాతం పడిపోయింది. ఇదే సమయంలో వర్షాకాలం గడచిన ఐదేళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మే వరకూ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయని బీఎంసీ అధికారులు వెల్లడించారు.

నాలుగేళ్ల క్రితం... అంటే 2016లో జనవరి నుంచి మే మధ్యకాలంలో, కలుషిత నీరు, దోమల కారణంగా 1,762 కేసులు నమోదుకాగా, అది ఈ సంవత్సరం 809కి పరిమితమైందని అధికారులు వెల్లడించారు. ఇక కేవలం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను పరిశీలిస్తే, 71 శాతం తగ్గుదల నమోదైందని, ప్రజలంతా ఇళ్లలో ఉండటమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు వెల్లడించారు.

ప్రజల కదలికలు తగ్గడం, పార్కులు, ఆట స్థలాలకు పిల్లలు వెళ్లకపోవడం, నిర్మాణ రంగం మూతపడటం తదితర కారణాలతో వ్యాధుల సంఖ్య తగ్గిందని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కూడా తగ్గడంతో దోమల వ్యాప్తి జరగలేదని బీఎంసీ అడిషనల్ కమిషనర్ సురేశ్ కాకాని వెల్లడించారు.

ఇక వర్షాకాలం మొదలు కావడంతో ఈ తరహా రోగులకు చికిత్స కోసం కోవిడ్ కు కేటాయించని ఆసుపత్రులను కేటాయించామని, డెంగ్యూ, మలేరియా, కుష్టువ్యాధి ఉన్న రోగులకు కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రితో పాటు ఇతర స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తామని అన్నారు.

More Telugu News