PIB: న్యూఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం మూసివేత!

National Media Center Closed in New Delhi
  • పీఐబీ ప్రిన్సిపల్ డైరెక్టర్ కు కరోనా
  • చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు తరలింపు
  • జూన్ 3న మీడియా సమావేశంలో థాట్ వాలియా
  • అందరూ హోమ్ క్వారంటైన్
దేశమంతటికీ ఇండియాలో కరోనా కేసుల వివరాలను, తాజా పరిస్థితులను అందిస్తున్న రాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - జాతీయ మీడియా కేంద్రం) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ థాట్ వాలియాకు వైరస్ సోకడంతో ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో పరీక్షలు నిర్వహించిన అధికారులు కరోనా పాజిటివ్ గా తేల్చారు.

ప్రస్తుతం థాట్ వాలియాను ఢిల్లీలోని ఎయిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించారు. పీఐబీ సెంటర్ ను పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించిన అధికారులు, నేటి నుంచి మీడియా సమావేశాలను, పీఐబీ కార్యకలాపాలను శాస్త్రి భవన్ నుంచి నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

కాగా, ఈ నెల 3వ తేదీన కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, నరేంద్ర సింగ్ తోమర్ లతో కలిసి, నాటి కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వాలియా మీడియాకు వెల్లడించారు. ఇక ఆ రోజు మీడియా సమావేశాలకు వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని, వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.
PIB
That Walia
Corona Virus
Close
New Delhi

More Telugu News