Madras High Court: ముగ్గురు జడ్జీలకు కరోనా... మద్రాస్ హైకోర్టు మూసివేత!

Madras High Court Close After 3 Judges Gets Corona
  • ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విననున్న న్యాయమూర్తులు
  • న్యాయవాదులు, సిబ్బంది కోర్టుకు రావద్దని ఆదేశాలు
మద్రాసు హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ రావడంతో, మొత్తం హైకోర్టును మూసివేశారు. ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ జరుగుతుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలను జరిపించేందుకు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. కాగా, లాక్ డౌన్ సమయంలో కోర్టును మూసివేసిన తరువాత ఈ నెల 1 నుంచే కోర్టులో విచారణలు తిరిగి మొదలయ్యాయి. మద్రాసుతో పాటు మధురై హైకోర్టు బెంచ్ లోనూ విచారణలు జరుగుతూ వచ్చాయి.

ముగ్గురు జడ్జీలకు కరోనా సోకడంతో మిగతా వారి నమూనాలనూ వైద్యాధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ రిపోర్టులు రావాల్సివుంది. హైకోర్టు న్యాయమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో కలిసి సమావేశమై, హైకోర్టుకు తాళం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ రావద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల నిమిత్తం ఓ ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేసి, జడ్జీలు ఇంటి నుంచే విచారణలు చేపట్టాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు.

కాగా, మద్రాస్ హైకోర్టుకు ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే తాళం వేస్తారు. ఈ స్థలాన్ని హైకోర్టు నిమిత్తం అప్పగించిన యజమాని విధించిన నిబంధనే ఇందుకు కారణం. వేసవి సెలవుల్లోనూ స్పెషల్ బెంచ్ లను ఏర్పాటు చేసి, విచారణలు జరుపుతుంటారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటవుతూ ఉంటాయి.
Madras High Court
Close
Corona Virus
Judges

More Telugu News