Sonali Phogat: ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ 'టిక్ టాక్' స్టార్.. వీడియో ఇదిగో!

BJPs TikTok Star Sonali Phogat Hits Official With Slippers
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టిక్ టాక్ స్టార్ సొనాలీ
  • ఆమెను దూషించిన అధికారి
  • ఆ తర్వాత క్షమించమని వేడుకున్న వైనం
బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫొగాట్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హర్యాణాలో ఒక అధికారిని ఆమె చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సొనాలీ ఫొగాట్ ఓటమిపాలయ్యారు.

ఈరోజు జరిగిన వివాదంలోకి వెళ్తే, కొందరు రైతుల జాబితా తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అధికారి వద్దకు ఆమె వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఆమెను సదరు అధికారి దూషించారు. దీంతో, ఆమె ఆయనను చెప్పుతో కొట్టారు. ఇదంతా పక్కనున్న వారు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత  ఆమెను సదరు అధికారి క్షమించమని వేడుకోవడం వీడియోలో ఉంది. మీరు తీసుకొచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే అధికారం తనకులేదని ఆయన వేడుకున్నారు. ఆ తర్వాత ఆమె పోలీసులను పిలిపించారు. అయితే, సదరు అధికారి వేడుకోవడంతో ఆయనపై ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటన నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆయన డిమాండ్ చేశారు. ఒక జంతువును కొట్టినట్టు సదరు అధికారిని కొట్టారని విమర్శించారు. ప్రభుత్వ అధికారిగా పనిచేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.

టిక్ టాక్ స్టార్ గా ఫొగాట్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రచార సమయంలో కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మాతాకి జై' అని అనని వారికి ఎలాంటి విలువ లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Sonali Phogat
TikTok
BJP
Slaps Official

More Telugu News