Reliance Jio: జియోలో ముబాదాలా భారీ పెట్టుబడి.. రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ను అధిగమించిన రిలయన్స్

  • జియోలో ముబాదాలా సంస్థ రూ. 9,093 కోట్ల పెట్లుబడులు
  • ఆరు వారాల్లో రూ. 87,655 కోట్లను సేకరించిన జియో
  • చాలా సంతోషంగా ఉందన్న ముఖేశ్ అంబానీ
Reliance Industries Market Cap Tops Rs 10 Lakh Crore

ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. రిలయన్స్ కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ లో అబుదాబీకి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ రూ. 9,093.60 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఈరోజు ప్రకటించిన నేపథ్యంలో... రిలయన్స్ మార్కెట్ క్యాప్ అమాంతం పెరిగింది. ఇప్పటికే ఫేస్ బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్ తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆరు వారాల్లోపు జియో రూ. 87,655.35 కోట్టను సేకరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈరోజు స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ షేర్ విలువ 2.39 శాతం పెరిగింది.

ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇన్వెస్టర్ ముబాదాలా రిలయన్స్ తో చేతులు కలపడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. డిజిటల్ రంగంలో ఇండియాను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.

More Telugu News