Chandrababu: మాపై అక్కసుతో... పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారు: చంద్రబాబు

  • తమ హయాంలో 29 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు వెల్లడి
  • గత ఏడాదిగా ఇళ్ల పనులు ఆపేశారని ఆరోపణ
  • పేదల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారంటూ ఆగ్రహం
Chandrababu slams YSRCP government over housing to poor

వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పేదల కోసం నాడు టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించిందని వెల్లడించారు. మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని తెలిపారు.

అయితే, గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ ఆపేశారని, టీడీపీపై అక్కసుతో పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ ఓ కుంభకోణంలా మారిందని, ఎకరా రూ.7 లక్షల విలువ చేయని భూములను రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకర్గంలో ఓ కుంభకోణం జరిగిందని, ఆవ భూముల్లోనే రూ.400 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్టు నిజనిర్ధారణ కమిటీ పేర్కొందని, ఇది చాలదన్నట్టుగా తాజాగా పేదల నుంచి వసూళ్ల దందాకు తెరలేపిందంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు.

ఇళ్ల స్థలం కావాలంటే రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.1.5 లక్షలు అంటూ రేట్లు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామానికో రేటు, దగ్గరలో అయితే ఒక రేటు, దూరంగా అయితే మరో రేటు నిర్ణయించి వసూళ్ల దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. చివరికి పేదల సంక్షేమంలోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసీపీదేనని ఎద్దేవా చేశారు.

More Telugu News