APSRTC: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడానికి అనుమతించండి.. ఏపీ ప్రభుత్వానికి కలెక్టర్ల విన్నపం

AP Collectors Wants to Resume Inter State Bus Services
  • పలు రాష్ట్రాల నుంచి వెల్లువలా వస్తున్న ప్రయాణికులు
  • వారి వివరాల సేకరణ కష్టసాధ్యంగా మారింది
  • రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్న ఎంటీ కృష్ణబాబు
విమానాలు, ప్రైవేటు వాహనాల్లో వేలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివస్తున్న వేళ, వారందరి వివరాలను సేకరించడం చాలా కష్టసాధ్యంగా ఉందని, 8వ తేదీ తరువాత పక్క రాష్ట్రాల నుంచి బస్సులను నడిపించేందుకు అనుమతించాలని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి 4 వేల మందికి పైగా వచ్చారని, వారందరినీ స్క్రీనింగ్ చేసి, వారి వివరాలు, వారు వెళుతున్న ప్రాంతాల వివరాల సేకరణ పెను సమస్యగా మారిందని కలెక్టర్లు తెలిపారని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని, జూన్ 8 నుంచి బస్సులు పునఃప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కాగా, కేంద్రం ఇప్పటికే అన్ని రకాల బస్సు సేవలనూ నడిపేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఏపీఎస్ఆర్టీసీ మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది.

నాలుగో దశ లాక్ డౌన్ నిబంధనల మినహాయింపు తరువాత తాము తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తూ, బస్సు సర్వీసుల పునరుద్ధరణపై విన్నవించామని, ఇప్పటివరకూ తమకు సమాధానం రాలేదని, తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసిందని కృష్ణబాబు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నదన్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేదని, ఈ విషయంలో మరోమారు లేఖను రాయనున్నామని ఆయన తెలిపారు.
APSRTC
District Collectors
MT Krishnababu
Buses
Andhra Pradesh
Telangana

More Telugu News