కేరళలో ఏనుగు మృతి పట్ల తీవ్రంగా స్పందించిన కేంద్రం

04-06-2020 Thu 10:14
  • టపాసులతో నింపిన పైనాపిల్ ఇచ్చి ఏనుగును చంపిన వైనం
  • కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రకాశ్ జవదేకర్
  • ఇలాంటి ఘటనలు భారతీయ సంస్కృతి కాదని వ్యాఖ్య
  • దర్యాప్తు బృందాన్ని నియమించిన కేరళ ప్రభుత్వం
javadekar on elephant death

కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగుకు కొందరు టపాసులతో నింపిన పైనాపిల్ ఇవ్వడంతో అది నోట్లో పెట్టుకుని తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏనుగు మృతి ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

దాని మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఇలాంటి ఘటనలు భారతీయ సంస్కృతి కాదు అని ఆయన చెప్పారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక పంపించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, ఏనుగు మృతి ఘటనపై విచారణకు వన్యప్రాణి నేర దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దర్యాప్తు బృందాన్ని పాలక్కడ్‌కు పంపామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఇప్పటికే పోలీసులను ఆదేశించామని తెలిపారు.