Honor: శరీర ఉష్ణోగ్రతను చెప్పేసే ఆనర్ స్మార్ట్ ఫోన్... ధర సుమారు రూ. 32 వేలు!

  • ఇన్ ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సర్ తో స్మార్ట్ ఫోన్ 
  • మైనస్ 20 డిగ్రీలను కూడా గుర్తించే సెన్సర్
  • 8 జీబీ రామ్, 5జీ, జూమ్ కెమెరా సౌకర్యం కూడా
Smart Phone With Temperature Sensor

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ఎక్కడికి వెళ్లాలన్నా థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరైన నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఆనర్, 'ప్లే 4 ప్రో' పేరిట ఇన్ ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సర్ తో కూడిన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన వీడియోను సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో అందుబాటులోకి రాగా, మిగతా దేశాల్లో ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయన్న విషయంలో సంస్థ స్పష్టతనివ్వలేదు.

ఇక ఈ ఫోన్ లోని సెన్సర్ మైనస్ 20 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ (మైనస్ 4 నుంచి 212 డిగ్రీల ఫారిన్ హీట్) వరకూ గుర్తించగలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత ఒక డిగ్రీలో పదో వంతు తగ్గినా, ఈ ఫోన్ గుర్తిస్తుంది. 2016లో క్యాట్ సంస్థ ఎస్ 60 పేరిట విడుదల చేసిన ఫోన్ లో థర్మల్ ఇమేజింగ్ కెమెరాను అమర్చారు. అయితే, ఆ ఫోన్ కొంతమంది అవసరార్థులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

కాగా, ఆనర్ ప్లే 4 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, మీడియా టెక్ ప్రాసెసర్, 8 జీబీ రామ్, జూమ్ కెమెరా, 5జీ సదుపాయాలుంటాయి. దీని ధర 421 డాలర్లు (సుమారు రూ. 32 వేలు). ఇదే మోడల్ లో ధర్మల్ సెన్సర్ లేకుండా ఉండే స్మార్ట్ ఫోన్ ప్లే 4 ధర 407 డాలర్లుగా ఉంటుంది.

More Telugu News