LG Polymers: పర్యావరణానికి హాని జరిగితే మౌనంగా చూస్తూ కూర్చోలేం... ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక తీర్పు

  • పర్యావరణ పునరుద్ధరణ కమిటీ సహా పలు కమిటీలు వేయాలని సూచించిన ఎన్జీటీ 
  • అనుమతుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారిపై చర్యలకు ఆదేశం
  • ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ. 50 కోట్లు ఎలా ఉపయోగించాలో చెప్పిన ట్రైబ్యునల్
National Green Tribunal Verdict On LG Polymers

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కీలక తీర్పు వెలువరించింది. ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ. 50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి ఉపయోగించాలంటూ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీ నుంచి ఒక్కొక్కరుతో పాటు, విశాఖ కలెక్టర్‌తో పర్యావరణ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించింది.

అలాగే, బాధితులకు పరిహారం ఎంత ఇవ్వాలో నిర్ణయించేందుకు ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చేయాలన్న ట్రైబ్యునల్ రెండు వారాల్లో కమిటీని ఏర్పాటు చేసి, రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శిని ఆదేశించింది.

కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోని అధికారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. ఏ చర్యలు తీసుకున్నదీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. చట్టబద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ మళ్లీ ప్రాంరంభం కాకూడదని ఆదేశించింది.

ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లలో పర్యావరణ నిబంధనల తనిఖీకి నిపుణుల కమిటీ వేయాలని, మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు, పర్యావరణానికి హాని జరిగితే మౌనంగా కూర్చుని చూస్తూ ఉండలేమని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

More Telugu News