India: ఇలాగే వ్యాపిస్తే ఉత్పాతమే... లక్ష దాటిన 15 రోజుల్లోనే రెండు లక్షలకు కరోనా కేసులు!

Corona Cases Double In India in Only 15 Days
  • ఇండియాలో కరోనా వీర విజృంభణ
  • రెండు నెలల్లో 32 లక్షల కేసులు వచ్చే అవకాశం
  • హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
ఇండియాలో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసులు మంగళవారం రాత్రితో 2 లక్షలు దాటాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమవుతుంది. ఇదే వేగంతో కేసులు విస్తరిస్తే, మరో 30 రోజుల్లో ఎనిమిది లక్షలు, ఆపై మరో నెల రోజుల వ్యవధిలో 32 లక్షల కేసులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక మంగళవారం ఒక్కరోజులో 200 మందికి పైగా మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,600కు చేరువైంది. ప్రస్తుతం మొత్తం కేసుల పరంగా ఇండియా ఏడో స్థానంలో ఉంది. ఇండియాకు పైన ఇటలీ 2.33 లక్షల కేసులతో ఉండగా, మూడు నుంచి నాలుగు రోజుల్లోనే ఇండియా ఆరో స్థానానికి చేరి, ఇటలీని కిందకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక కరోనా కేసులలో అమెరికా 18 లక్షల కేసులతో తొలి స్థానంలో ఉండగా, ఇండియాలో వైరస్ ఇదేలా వ్యాపిస్తే, మూడు నెలల్లో అమెరికాను దాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియాలో టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, టెస్టులు అధికంగా జరిపితే ఇంకెన్నో వేల కేసులు వెలుగులోకి వస్తాయని వైద్య రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకుంటే, ఇండియాలో వైద్య ఉత్పాతం తప్పదని హెచ్చరించారు.
India
Corona Virus
New Cases

More Telugu News