Mumbai: 100 ఏళ్ల తరువాత ముంబైపై అరేబియా సముద్రం ఆగ్రహం... బుసలుకొడుతున్న 'నిసర్గ' తుపాను!

  • భారీ వర్షాలకు ఇప్పటికే నగరం అతలాకుతలం
  • తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీఎం
Heavy Rainfall on Mumbai after 100 Years

దాదాపు 100 సంవత్సరాల తరువాత ముంబై మహా నగరంపై అత్యంత తీవ్ర తుపాను 'నిసర్గ' రూపంలో బుసలు కొడుతోంది. మరోపక్క, తుపాను తీరం దాటక ముందే ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న వేళ, తుపాను వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఇప్పటికే ముంబై తీర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించింది. ముంబై తీర ప్రాంతాల్లో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రపు అలలు సుమారు 6 అడుగుల ఎత్తుతో ఎగసి పడుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరింత వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభించారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కోరారు. 'నిసర్గ' ప్రభావం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, మరో రెండు రోజుల పాటు ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. లాక్ డౌన్ కారణంగా పునఃప్రారంభమైన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, మరో మూడు రోజుల పాటు మూసి ఉంచాలని కోరారు.

More Telugu News