ap7am logo

శ్రీ వెంకటేశ్వరుని వీక్షించేందుకు ఎన్నెన్ని ఆంక్షలో... తొలి దర్శనం ఎవరికంటే..!

Wed, Jun 03, 2020, 06:26 AM
Tirumala Darshans from 11th
  • భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి
  • 8 నుంచి దర్శనాల ట్రయల్ రన్
  • ఉద్యోగులు, స్థానికులకు తొలి దర్శనం
  • 11 నుంచి భక్తులకు దర్శనాలు
  • సేవల విషయంలో ఇంకా వెలువడని నిర్ణయం
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా కోట్లాది మంది ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగలేదు. ఇప్పుడిక దర్శనాలకు అనుమతి లభించింది. ఈ నెల 8 తరువాత ఏ క్షణమైనా తిరుమలలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. 'అదివో అల్లదివో శ్రీహరి వాసము...' అంటూ భక్తులు వేచి చూస్తున్న వేళ, పలు ఆంక్షల మధ్య స్వామిని కనులారా దర్శించుకునే సమయం దగ్గర కానుంది.

8వ తేదీ తరువాత ప్రార్థనాలయాలు తెరచుకునేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, వేములవాడ, యాదాద్రి తదితర ఆలయాలు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ భౌతిక దూరం పాటించేలా చూడటం తప్పనిసరి కావడంతో, దానితో పాటు మాస్క్ లు ధరించడం, ఎక్కడికక్కడ శానిటైజర్లను ఏర్పాటు చేయడం, భక్తుల సంఖ్యను తగ్గించడంపై అధికారులు దృష్టిని సారించి, ఈ మేరకు భక్తుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రారంభించారు.

ఇక తిరుమల విషయానికి వస్తే, ఇప్పటికే క్యూ లైన్లు మారిపోయాయి. వరుసగా వెళ్లే క్యూలైన్లు జిగ్ జాగ్ గా మారాయి. రోజుకు దాదాపు 85 నుంచి 95 వేల మందికి దర్శనాన్ని ఇచ్చే దేవదేవుడు ఇకపై గరిష్ఠంగా 10 నుంచి 15 వేల మందికి మాత్రమే కనిపించనున్నాడు. తొలి దశలో 7 వేల మందికి, ఆపై దశలవారీగా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విధివిధానాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే సిద్ధం చేసింది.

సర్వదర్శనం విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ఆన్ లైన్, టైమ్ స్లాట్ టోకెన్, దివ్య దర్శనం విధానాలను మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టైమ్ స్లాట్, దివ్య దర్శనాలను కలిపివేయాలని, నడిచి వెళ్లే భక్తులకు కూడా ముందుగానే ఆ విషయాన్ని తెలిపి కాస్తంత వ్యవధితో టైమ్ స్లాట్ టోకెన్ తీసుకునేలా చూడాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఆన్ లైన్ లో దర్శన స్లాట్లను బుక్ చేసుకునే భక్తులకు దర్శన సమయానికి కొన్ని గంటల ముందుగా మాత్రమే కొండపైకి అనుమతి లభించనుంది.

ఇక వివిధ రకాలైన సేవా టికెట్లను బుక్ చేసుకునే భక్తుల విషయంలో ఎటువంటి విధానాలను అవలంబించాలన్న విషయమై అధికారులు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అతి ముఖ్యమైన అభిషేకం, సుప్రభాతం, తోమాల సేవ, నిజ పాద దర్శనం, కల్యాణోత్సవం వంటి సేవల విషయంలో తదుపరి దశలో ఓ నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతానికి సేవలకు భక్తులను అనుమతించేది లేదని అంటున్నారు.

ఇదిలావుండగా, సాధారణ భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, తిరుమలలో నివసిస్తున్న స్థానికులకు తొలి మూడు, నాలుగు రోజుల్లో దర్శనం కల్పించాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరితో ట్రయల్ దర్శనాలు నిర్వహించి, ఆపై సాధారణ భక్తులను అనుమతించాలన్నది టీటీడీ ఉద్దేశం. తిరుమలలో 7,400 మంది ఉద్యోగులు, 14 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 5 వేల మంది స్థానికులు ఉండగా, వీరికి మూడు రోజుల్లో దర్శనం కల్పించి, ఆపై 11 నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad