Vishnu Kumar Raju: జగన్ ప్రభుత్వం ఎందుకు వేడుకలు చేసుకుంటుందో తెలియడంలేదు: విష్ణుకుమార్ రాజు

  • రాష్ట్ర అభివృద్ధి నాలుగు అడుగులు వెనక్కిపోతోందని విమర్శలు
  • రివర్స్ టెండరింగ్ తో పనులు నిలిచిపోయాయని విమర్శలు
  • వలంటీర్లకు రూ.10 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్
Vishnu Kumar Raju slams YSRCP government

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసిన చందంగా తయారైందని అన్నారు. అనేక ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ వేశారని, ఇప్పుడక్కడ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో కేటాయింపు పత్రాలు అందుకున్న వారికి ఇంకా ఇళ్లు దక్కలేదని, కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు రాష్ట్రంలో జగనన్న తోడు అంటూ పేరు మార్చారని మండిపడ్డారు.

అన్న క్యాంటీన్లను మూసివేశారని, ఇప్పుడవి ఉండుంటే కరోనా సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉండేవని, కనీసం జగనన్న క్యాంటీన్ అని పేరు మార్చైనా నడిపినా బాగుండేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఇక, రోజంతా కష్టించే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు రూ.5 వేల జీతం బాధాకరమని పేర్కొన్నారు.  రాష్ట్రంలో పరిస్థితులు ఇలావుంటే వైసీపీ ప్రభుత్వం, వారి నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News