Aarti Lalchandani: తబ్లిగీలు ఉగ్రవాదులు.. వారిని జైళ్లకో, అడవులకో పంపాలి: కాన్పూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్!

  • జమాత్ వ్యవహారం వెలుగు చూసిన సందర్భంలో వ్యాఖ్యలు
  • తాజాగా బయటపడిన వీడియో
  • ముస్లింల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమని వివరణ
Jamaatis are terrorists alleges Kanpur medical college principal

తబ్లిగీ జమాత్ సభ్యులు ఉగ్రవాదులని, వారిని అడవులకో, జైళ్లకో తరలించాలంటూ కాన్పూరులోని శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్తి లాల్ చందాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, ఆమె ఈ వ్యాఖ్యలను ఏప్రిల్‌లో చేసినట్టు తెలుస్తోంది. తబ్లిగీల గురించి అప్పట్లో ఆమె మాట్లాడుతుండగా కాన్పూరుకు చెందిన ఓ జర్నలిస్ట్ తీసిన వీడియో ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతోంది.

అందులో ఆమె మాట్లాడుతూ.. తబ్లిగీల వల్లే దేశం మొత్తం కరోనా వైరస్ వ్యాపించిందని ఆరోపించారు. అలాంటి ఉగ్రవాదులను మనం వీఐపీల్లా చూస్తున్నామని అన్నారు. చాలామంది వైద్యులు క్వారంటైన్‌లో ఉండడానికి తబ్లిగీలే కారణమని అన్నారు. తబ్లిగీలను పంపాల్సింది ఆసుపత్రులకు కాదని, జైళ్లకో, అడవులకో పంపాలని సూచించారు. 30 కోట్ల ఆ జనాభా వల్ల వంద కోట్ల జనాభా ఇబ్బందులు ఎదుర్కొంటోందని చందాని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆర్థిక ఎమర్జెన్సీకి వారే కారణమని మండిపడ్డారు.

చందాని వీడియో బయటకు వచ్చి దుమారం రేగడంతో తాజాగా సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని వివరణ ఇచ్చారు. నిజానికి తాను ఎవరి పేరును ప్రస్తావించలేదన్నారు. కొందరు కావాలనే తనపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. అంతేకాదు, తనకు ముస్లింలంటే ఎనలేని ప్రేమని, వారి కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని చందాని పేర్కొనడం గమనార్హం.

More Telugu News