Remove China Apps: చైనా యాప్ లను ఊడ్చిపారేసే వినూత్న యాప్... భారీగా డౌన్ లోడ్!

  • ప్లే స్టోర్ లో రిమూవ్ చైనా యాప్స్ యాప్ సందడి
  • చైనా యాప్ ల పాలిట యముడిగా గుర్తింపు
  • పది లక్షలు దాటిన డౌన్ లోడ్ల సంఖ్య
App called Remove China Apps garners huge response

90వ దశకం చివర్లో వాణిజ్య విప్లవం మొదలయ్యాక ప్రపంచంలో ఎక్కడ చూసినా చైనా వస్తువులే దర్శనమిస్తున్నాయి. చవకగా లభించడం, కాస్తో కూస్తో నాణ్యత కనిపించడంతో చైనా వస్తువులకు గిరాకీ పెరిగింది. ఇది అన్ని రంగాలకూ విస్తరించింది. నెట్టింట యూజర్లను ఆకట్టుకునేలా చైనా యాప్ లు కూడా తయారయ్యాయి. అయితే, భారత్ పట్ల చైనా అనుసరిస్తున్న ధోరణి భారతీయులను అసహనానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో చైనా వస్తువులను నిషేధించాలనే భావన బలపడుతోంది. ఇందులోంచి పుట్టిందే ఓ వినూత్న తరహా యాప్.

దీనిపేరు 'రిమూవ్ చైనా యాప్స్'. పేరుకు తగ్గట్టే ఫోన్ లో ఉన్న చైనా యాప్ లను తొలగిస్తుంది. ఈ యాప్ ను ఒక్కసారి ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు, ఫోన్ లో నిక్షిప్తమై ఉన్న చైనా యాప్ ల పనిబడుతుంది. స్టోరేజిలో మకాం వేసిన చైనా యాప్ లను సమూలంగా తుడిచిపారేస్తుంది. భారత్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎక్కువగా డౌన్ లోడ్ అవుతున్న యాప్ లలో ఇదీ ఒకటి. ప్రస్తుతం దీని డౌన్ లోడ్ల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దర్శనమివ్వడం మే 17 నుంచే.

దీనికి రేటింగ్ కూడా అదిరిపోయే స్థాయిలో ఉంది. యూజర్లు దీనికి 4.8 రేటింగ్ ఇచ్చారు. ఈ 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగానే ఎలాంటి రిజిస్ట్రేషన్, లాగిన్ అవసరం లేకుండా వెంటనే రంగంలోకి దిగిపోతుంది. 'స్కాన్' అనే ఆప్షన్ ను తాకగానే, ఫోన్ లో ఉన్న చైనీస్ యాప్స్ ను గుర్తించి డిలీట్ చేస్తుంది. అయితే ఫోన్ తో పాటే లభ్యమయ్యే ఇన్ బిల్ట్ యాప్స్ పై దీని ప్రభావం ఉండదు. ఇంతజేసీ, ఇది  విద్యా సంబంధిత యాప్ అని దీని తయారీదార్లు యాప్ సమాచారంలో పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

More Telugu News