Chandrababu: ఒకసారి కాదు, 65 సార్లు కోర్టులు తప్పుబట్టినా దులిపేసుకుంటున్నారు: చంద్రబాబు

  • నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు స్పందన
  • నీలం విలువల గురించి నేటి తరం తెలుసుకోవాలని హితవు
  • హీన స్థితికి దిగజారారంటూ వ్యాఖ్యలు
Chandrababu responds on Nilam Sanjeevareddy obituary

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. కేంద్రమంత్రి గా, లోక్ సభ స్పీకర్ గా, భారత రాష్ట్రపతిగా ఎన్నో పదవులు చేపట్టి, విశేషంగా సేవలందించిన తెలుగువెలుగు అంటూ కొనియాడారు. నీలం సంజీవరెడ్డి తన జీవితంలో పాటించిన విలువల గురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేశారని, తాను లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక కాగానే నిష్పాక్షికంగా ఉండాలని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టారని కొనియాడారు. అందువల్లే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చంద్రబాబు తెలిపారు.

అయితే, ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒక్కసారి కాదు, 65 సార్లు తప్పుబట్టినా దులిపేసుకుంటున్నారని తెలిపారు. కోర్టు వ్యాఖ్యలనే కాదు, కోర్టు తీర్పులను కూడా లక్ష్యపెట్టని పెడ ధోరణులు చూస్తున్నామని, పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే హీన స్థితికి దిగజారడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నీలం సంజీవరెడ్డి వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

More Telugu News