Kaikala Sathyanarayana: తన ఆరోగ్య రహస్యం వెల్లడించిన సీనియర్ నటుడు సత్యనారాయణ

  • సత్యనారాయణకు ఇప్పుడు 85 ఏళ్లు
  • కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైన సత్యనారాయణ
  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం
Kaikala Sathyanarayana tells about his health secret

తెలుగు చిత్రసీమకు లభించిన గొప్పనటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుకు న్యాయం చేసేలా తన కెరీర్ లో అనేక మరపురాని పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్లు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ముఖ్యంగా, తన ఆరోగ్యం, జీవన విధానం గురించి వివరించారు. తనకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల్లేవని తెలిపారు.

అయితే ఆర్నెల్ల కింద బాత్రూంలో కిందపడడంతో కొద్దిగా కాలు నొప్పి వస్తోందని, డాక్టర్ గురవారెడ్డి ట్రీట్ మెంట్ తో నయమైందని వెల్లడించారు. ఉదయం 5 గంటలకు లేచి కాస్త ఒళ్లు కదిలేలా చేతులు, కాళ్లు కదిలిస్తూ స్వల్ప వ్యాయామం చేస్తానని, ఆరింటికి గ్రీన్ టీ, తేనె కలుపుకుని సేవిస్తానని తెలిపారు. ఆ తర్వాత మరో గంటకు ఓ కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుంటానని, అనంతరం మూడు ఇడ్లీలో, రెండు దోసెలో తిని, ఓ గ్లాసుడు రాగిజావతో బ్రేక్ ఫాస్ట్ ముగిస్తానని సత్యనారాయణ పేర్కొన్నారు. కొన్ని విటమిన్ మాత్రలు కూడా తన జీవితంలో భాగమైపోయాయని, 11 గంటలకు ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటానని చెప్పారు.

మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు అన్నం మాత్రమే తింటానని, అది కూడా దంపుడు బియ్యంతో చేసిన అన్నమేనని వెల్లడించారు. తాము ప్రత్యేకంగా ఏలూరు సమీపంలోని దోసపాడు నుంచి బియ్యం తెప్పించుకుంటామని వివరించారు. మధ్యాహ్నం రెండు గంటలు ప్రశాంతంగా నిద్రపోతానని, ఆపై సాయంత్రం 5 గంటలకు మసాలా దినుసులతో చేసిన తేనీరు సేవిస్తానని చెప్పారు.

డిన్నర్ లో మాత్రం చిరుధాన్యాల పిండితో చేసిన దోసెలు, లేకపోతే ఒక కప్పు అన్నం తింటానని, తాను 10 గంటలకే నిద్రకు ఉపక్రమిస్తానని చెప్పారు. అయితే, బుధవారం, ఆదివారం మాంసాహారం కూడా తన మెనూలో ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. తక్కువ మోతాదులో, మేలైన ఆహారం తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని అన్నారు.

More Telugu News