తెలంగాణలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే ఆరుగురి మృతి

30-05-2020 Sat 22:02
  • రాష్ట్రంలో 77కి పెరిగిన మరణాలు
  • 74 కొత్త కేసులు వెల్లడి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 41 మందికి కరోనా
Telangana faces more corona heat

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 77కి పెరిగింది. ఇక, గడచిన 24 గంటల్లో తెలంగాణలో 74 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వాటిలో 60 స్థానికులవి కాగా, మరో 14 కేసులు బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో గుర్తించారు. ఎప్పట్లానే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తమ్మీద ఇప్పటివరకు తెలంగాణలో 2,499 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,412 మంది డిశ్చార్జి కాగా, 1,010 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.