హైకోర్టు తీర్పుపై ఏజీ వ్యాఖ్యానించడం దారుణం: యనమల

30-05-2020 Sat 21:29
  • నిమ్మగడ్డ వ్యవహారంపై ఏజీ ప్రెస్ మీట్
  • ఏజీ ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడూ చూడలేదన్న యనమల
  • ఏజీ వక్రభాష్యాలు చెప్పారంటూ విమర్శలు
Yanamala responds on AG press meet over Nimmagadda issue

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వివరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

ఏజీ మీడియా సమావేశం పెట్టడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏజీ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడ్డారు. తీర్పులో పేర్కొన్న 'స్టాండ్ రిస్టోర్డ్' అనే పదాన్ని ప్రస్తావించారని, 'స్టాండ్ రిస్టోర్డ్' పదాన్ని ప్రస్తావిస్తూనే ఏజీ వక్రభాష్యాలు చెప్పారని విమర్శించారు.

తీర్పుపై అప్పీల్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అందుకు భిన్నంగా ఏజీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గతంలో లేదని యనమల వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ దురుద్దేశాలను ఏజీ ద్వారా చెప్పించాలనే తాపత్రయం వెల్లడైందని ఆరోపించారు. ఆర్టికల్ 213(కె)1 అనుసరించి ఎస్ఈసీని నియమించేది గవర్నరేనని అన్నారు. ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎస్ఈసీని నియమించడాన్ని హైకోర్టు ఆక్షేపించిందని యనమల స్పష్టం చేశారు.