అసలు 'మాట తప్పం, మడమ తిప్పం' అనే మాటే ఒక పెద్ద అబద్ధం: చంద్రబాబు

30-05-2020 Sat 18:56
  • వందశాతం అబద్ధాలు ఆడేవాళ్ల సంగతేంటన్న చంద్రబాబు
  • రైతు భరోసాలో మోసం చేస్తున్నారని వెల్లడి
  • పింఛనుపైనా మాట తప్పారని ఆరోపణలు
Chandrababu slams AP CM Jagan and his government

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. వంద మాటలు చెప్పి అందులో ఒక్క అబద్ధం ఆడితేనే అతడిపై అబద్ధాల కోరు అనే ముద్ర పడుతుందని, అలాంటిది నూటికి నూరుశాతం అబద్ధాలు ఆడే వాళ్ల సంగతేంటని ప్రశ్నించారు. వైసీపీ పాలకులు పరోక్షంగా ఆ కోవలోకే వస్తారని, అసలు, మాట తప్పం-మడమ తిప్పం అనే మాటే ఒక పెద్ద అబద్ధం అని వ్యాఖ్యానించారు.

"రైతు భరోసా పథకంలో చూస్తే, ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 ఇస్తామన్నారు. తర్వాత రూ.6,500 మాత్రమే అన్నారు. ఈ విషయంలో టీడీపీ నిలదీస్తే మరో రూ.1000 పెంచి రూ.7,500 చేశారు. ఇదొక మోసం. కనీసం అదైనా అందరికీ ఇవ్వలేదు. సగం మంది రైతులకే ఇస్తున్నారు. ఇక, 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛను ఇస్తామని చెప్పాడీ పెద్దమనిషి! కానీ, నేనలా చెప్పలేదని ఏకంగా శాసనసభలోనే అనడం ఎంత పెద్ద మోసం! ఇలాంటి మోసాలు ఏడాది కాలంలో రోజుకొకటి చేశారంటే ఆ ఘనత వైసీపీదే. ఇకనైనా పాలకులు వెనుకటి బుద్ధులు మానుకోవాలి" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.