పైలట్ కు కరోనా.. మధ్యలోనే వెనక్కి వచ్చేసిన ఎయిరిండియా విమానం

30-05-2020 Sat 17:07
  • ఢిల్లీ నుంచి మాస్కో బయల్దేరిన విమానం
  • మార్గమధ్యంలో పైలట్ కు కరోనా పాజిటివ్ అని గుర్తింపు
  • వెనక్కి వచ్చేయాలని ఆదేశించిన అధికారులు
Air Indias Delhi Moscow Flight Returns Midway as pilot tested corona positive

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యాలో ఉన్నవారిని తీసుకురావడానికి ఢిల్లీ నుంచి మాస్కోకు ఎయిరిండియా విమానం బయల్దేరింది. విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. కేవలం క్రూ సిబ్బంది మాత్రమే ఉన్నారు.

అయితే, విమానం ఉజ్బెకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించగానే అందులోని ఒక పైలట్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో, విమానాన్ని తిరిగి వెనక్కి రావాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో, విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. సదరు పైలట్ ను ఐసొలేషన్ వార్డుకు తరలించి, ఇతర సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచారు.

సిబ్బంది ప్రీ-ఫ్లైట్ టెస్ట్ రిపోర్టులను తనిఖీ చేస్తున్న బృందం... పైలట్ కు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ  పొరపాటున నెగెటివ్ వచ్చినట్టు పేర్కొంది. దీంతో, సదరు పైలట్ ను విమానంలోకి అనుమతించారు. విమానం వెళ్లిపోయిన తర్వాత జరిగిన పొరపాటును గుర్తించారు. దీంతో, వెనక్కి వచ్చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు.