నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో వ్యవస్థల్ని నడిపారు: కొడాలి నాని

30-05-2020 Sat 16:59
  • నిమ్మగడ్డ ఓ ద్రోహి అంటూ నాని వ్యాఖ్యలు
  • మళ్లీ ఎస్ఈసీగా వచ్చినా ఏమీ చేయలేరని ధీమా
  • పై కోర్టుకు వెళతామని వెల్లడి
Kodali Nani comments on Nimmagadda Ramesh Kumar

ఎస్ఈసీగా తనను తొలగించడంపై హైకోర్టులో ఊరట పొందిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ టీడీపీ కనుసన్నల్లో, వారికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. నిమ్మగడ్డ ఓ ద్రోహి అని, చంద్రబాబుకున్న యంత్రాంగం ద్వారా లేఖలు పంపారని విమర్శించారు. ఈ అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. నిమ్మగడ్డ మళ్లీ ఎస్ఈసీగా వచ్చినా ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చినంత మాత్రాన తమ ప్రభుత్వానికేమీ ఢోకా లేదని, అనుకున్నది చేసి తీరుతుందని నాని స్పష్టం చేశారు. ఒక కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్లడం సర్వసాధారణమైన విషయం అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.