చీరాల వైసీపీలో ఘర్షణ.. కొట్టుకున్న కరణం, ఆమంచి అనుచరులు!

30-05-2020 Sat 16:49
  • ఇటీవలే వైసీపీలో చేరిన కరణం బలరాం కుమారుడు
  • కలవలేకపోతున్న బలరాం, ఆమంచి వర్గీయులు
  • చీటికిమాటికి గొడవపడుతున్న ఇరు వర్గాలు
Fight between Karanam Balaram and Amanchi followers

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వైసీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈమధ్య టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ కండువాను ఆయన నేరుగా కప్పుకోకపోయినా... ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ ను జగన్ పార్టీలో చేర్పించారు. ఇది నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు ఏమాత్రం నచ్చలేదు. నేతలు ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ... వీరి అనుచరులు మాత్రం కలవలేకపోతున్నారు. చీటికీమాటికీ గొడవపడుతున్నారు. వైసీపీ కార్యక్రమాలను కూడా ఎవరికి వారు నిర్వహించుకుంటున్నారు. తాజాగా రామపురంలో జరిగిన చిన్న గొడవ చివరకు ఉద్రిక్తంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే, వేటపాలెం మండలం రామాపురంలో బలరాం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రామలింగయ్య స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనడంతో చిన్నగా గొడవ ప్రారంభమైంది. చివరకు ఇది ఇరు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లింది. వాస్తవానికి వారం రోజుల నుంచే గ్రామంలో వాతావరణం వేడెక్కింది. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో ఇరు వర్గీయుల మధ్య వివాదం జరుగుతోంది. ఆ వివాదం కాస్తా... ఈరోజు మరో చిన్న కారణంతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఘర్షణ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.

గత ఏడు రోజులుగా ఈ విషయమై వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన గొడవలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.