Chandrababu: ప్రజావేదికతో ప్రారంభించి.. ఏడాది మొత్తం యథేచ్చగా కొనసాగించారు: చంద్రబాబు

  • మద్యం షాపుల ముందు టీచర్లను పెట్టి మందు అమ్మించారు
  • అవివేక నిర్ణయాలతో ప్రజలను నట్టేట ముంచారు
  • ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారు
Why you are celebrating one year ruling questions Chandrababu

సంపూర్ణ మద్యనిషేధం విధించడానికి 45 రోజుల లాక్ డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ, మద్యం షాపుల ముందు టీచర్లను కాపలాగా పెట్టి వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని అమ్మిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వైసీపీ అరాచకాలను మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికతో విధ్వంసాన్ని ప్రారంభించి, ఏడాది మొత్తం యథేచ్చగా కొనసాగించారని దుయ్యబట్టారు.

అవివేకమైన నిర్ణయాలతో ప్రజలను నట్టేట ముంచారని చంద్రబాబు అన్నారు. హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు, మహిళలు, పేదలు, రైతులు, యువత అందరినీ రోడ్డెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు గత 164 రోజులుగా ఆందోళన చేస్తున్నారని... ప్రభుత్వ తీరుకు ఇదొక నిదర్శనమని చెప్పారు.

ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో విషవాయు బాధితులు, కరోనాతో కర్నూలు వాసులు, న్యాయం కోసం అమరావతి వాసులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత, ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, పంటకు గిట్టుబాటు లేక బాధ పడుతున్న రైతులు... రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాధలే ఉన్నప్పుడు ఉత్సవాలు ఎందుకని ఎద్దేవా చేశారు.

More Telugu News