అట్టుడుకుతున్న అమెరికా.. పలు నగరాల్లో హింసాకాండ!

30-05-2020 Sat 15:52
  • ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మెడను కాలితో నొక్కి చంపిన పోలీసు
  • పలు నగరాల్లో హింసకు పాల్పడుతున్న నల్లజాతీయులు
  • పోలీసుపై హత్యాయత్నం కేసు నమోదు
Protests across America after police killing black

జాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుడిపై ఓ తెల్లజాతీయుడైన పోలీసు కర్కశంగా వ్యవహరించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో, ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా పలు నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి.

ప్రారంభంలో శాంతియుతంగానే ఉన్న నిరసనలు... ఆ తర్వాత హింసాత్మకంగా మారాయి. 'జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్' అని నినదిస్తూ... పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వారు. కొన్ని చోట్ల వాహనాలు, భవనాలకు నిప్పుపెట్టారు. వీటిలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. హింసాత్మక ఘటనల్లో పోలీసులు సైతం గాయపడ్డారు. మరోవైపు ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన పోలీసుపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. థర్డ్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదైంది.

ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో పెంటగాన్ రంగంలోకి దిగింది. పరిస్థితి చేయి దాటకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైతే  మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం.

పోలీసు వాహనం పక్కన ఫ్లాయిడ్ ను బోర్లా పడుకోబెట్టి... మెడపై సదరు పోలీసు మోకాలితో నొక్కుతున్న వీడియో వైరల్ అయింది. తనకు ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయేటట్టు ఉందని వేడుకున్నా పోలీసులోని కర్కశత్వం తగ్గలేదు. చివరకు ఫ్లాయిడ్ ఊపిరి వదిలాడు. దీంతో అమెరికాలోని నల్లజాతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.