న్యూజిలాండ్ లో సద్దుమణిగిన కరోనా... వైరస్ పై విజయం!

30-05-2020 Sat 15:05
  • వారం రోజులుగా ఒక్క కేసూ లేని వైనం
  • 1504 మందికి కరోనా
  • ప్రస్తుతం ఒకే ఒక్క యాక్టివ్ కేసు
New Zealand victorious over corona

ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా వైరస్ ను సమర్థంగా కట్టడి చేసిన దేశం న్యూజిలాండ్. మిగతా దేశాలన్నీ కరోనాతో అల్లకల్లోలం అవుతున్నా, న్యూజిలాండ్ మాత్రం నిబ్బరంగా ఉందంటే అందుక్కారణం అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలే. న్యూజిలాండ్ లో ఇప్పటివరకు 1,504 మంది కరోనా బారినపడగా, కేవలం 22 మరణాలే సంభవించాయి. ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే కొనసాగుతోంది.  50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ కు ఇది ఘనవిజయం అని చెప్పాలి.

అయితే, కఠినమైన లాక్ డౌన్ ఆంక్షల వల్లే ఇది సాధ్యమైంది. కానీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత వారం రోజులుగా న్యూజిలాండ్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ తొలగించిన తర్వాత కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం న్యూజిలాండ్ సామర్థ్యానికి పరీక్ష కానుంది.