రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్, బౌలింగ్... స్ఫూర్తిదాయక వీడియో పంచుకున్న వీవీఎస్ లక్ష్మణ్

30-05-2020 Sat 14:01
  • కశ్మీర్ పారా క్రికెటర్ అద్భుత నైపుణ్యం
  • మెడ సాయంతో బ్యాటింగ్
  • కాలితో బౌలింగ్
 VVS Laxman shares an inspiring video of Kashmir para cricketer Amir

కశ్మీర్ కు చెందిన అమీర్ వాసిం గురించి వింటే ఇది నమ్మశక్యం కాదేమో అనుకుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అద్భుతం అనక మానరు. అమీర్ కు రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడగలడు. మెడకు బ్యాట్ తగిలించుకుని, తనదైన శైలిలో బ్యాటింగ్ చేయగలడు. మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ కాలితో బౌలింగ్ చేస్తాడు. అమీర్ గతేడాది దివ్యాంగుల వరల్డ్ క్రికెట్ సిరీస్ టోర్నమెంట్ కు ఎంపికయ్యాడు. తాజాగా, అమీర్ క్రికెట్ ప్రదర్శనకు చెందిన వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అమీర్ ఆట లక్ష్మణ్ ను ముగ్ధుడ్ని చేసింది.

అమీర్ ఆటపై వ్యాఖ్యానిస్తూ, "జీవితంలో ఎదగాలన్న నిప్పులాంటి ఆకాంక్ష మీ హృదయంలో బలంగా ఉంటే, మీ దారికి అడ్డం వచ్చే ఎలాంటి అవాంతరాల్నైనా అది దహించివేస్తుంది. ఈ విషయాన్ని అమీర్ తన వీడియో ద్వారా సోదాహరణంగా నిరూపించాడు. జీవితమే ఓ సవాల్ గా నిలిచిన తరుణంలో అమీర్ నైపుణ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎక్కడ బలమైన కోరిక ఉంటుందో అక్కడే ఓ మార్గం కూడా ఉంటుంది" అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.